GT vs RR: వరుస విజయాలతో గుజరాత్ టైటాన్స్.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో..! 9 d ago

IPL 2025 లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. కేవలం 159 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ ఆలౌట్ కావడంతో.. గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది.
టాస్ గెలిచినా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బరిలోకి దిగిన గుజరాత్ ఓపెనర్లను జోఫ్రా ఆర్చర్ తన వేగవంతమైన బౌలింగ్ తో కట్టడి చేసాడు. GT కెప్టెన్ శుభమన్ గిల్ (2) రెండవ ఓవర్‌లోనే ఔట్ కావడంతో టీం కు షాక్ కలిగింది. కానీ మరో ఎండ్ లో ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
ఫస్ట్ డౌన్‌లో వచ్చిన జోస్ బట్లర్ (36)- సాయి సుదర్శన్ (82) రెండో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖర్లో షారుక్ ఖాన్ (36).. రషీద్ ఖాన్ నాలుగు బంతుల్లో ఒక ఫోర్.. ఒక సిక్సర్‌తో 12 పరుగులు చేయగా, రాహుల్ తెవాటియా 12 బంతుల్లో రెండు ఫోర్లు.. రెండు సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6) తక్కువ పరుగులకే వెనుతిరిగాడు. ఆ తరువాత వచ్చిన నితీష్ రాణా కూడా ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరాడు. రియాన్ పరాగ్ (26) కూడా నిలబడలేక పోయాడు. జురెల్ (5) కూడా ఆకట్టుకోలేక పోయాడు. కెప్టెన్ సంజు శాంసన్ 28 బంతుల్లో 41 పరుగులు చెయ్యగా.. హెట్మయర్ 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు ఎవరు GT బౌలింగ్ ధాటికి నిలవలేక పోయారు. దీంతో RR జట్టు 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది.
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3--24తో ధాటిగా బౌలింగ్ చేస్తే, రషీద్ ఖాన్ 2--37, సాయికిశోర్ 2--20తో మిగతా బ్యాటర్లను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపారు. సిరాజ్ ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ ప్రస్తుత పర్పుల్ కాప్ హోల్డర్ గా ఉన్నాడు. 53 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేసిన సాయి సుదర్శన్ "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" గా నిలిచాడు.
టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 PM ISTకు ప్రారంభంకానుంది.